తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మండిపడ్డారు. అధికారం కోసమే చంద్రబాబు నాయుడు నిరవధిక నిరాహార దీక్షకు దిగారని ఆయన ఆరోపించారు. ఇలాంటి జిమ్మిక్కులు ఇప్పటికైనా ఆయన మానుకోవాలని చిరంజీవి హితవు పలికారు.
చిరంజీవి గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ నానాటికీ దిగజారి పోతున్న తన రాజకీయ ఉనికి కాపాడుకునేందుకే చంద్రబాబు దీక్షకు దిగారన్నారు. తొమ్మిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు.. వ్యవసాయమే దండగ అని పేర్కొన్నారు. ఇపుడు రైతులకు న్యాయం జరిగేంత వరకు దీక్ష చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఇకపోతే.. రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వరి రైతులకు రూ.200 బోనస్ ఇవ్వాలని కోరారు. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన ప్యాకేజీ ఆమోదయోగ్యంగా లేదని, అందువల్ల దీనిపై సమీక్ష చేసి కొత్త ప్యాకేజీని ప్రకటించాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.