తమిళనాడు సరిహద్దుల్లోనున్న నెల్లూరు జిల్లాలోని తడ ప్రాంతంలో అపాచీ బూట్ల కంపెనీకి కేటాయించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు.
అపాచీ బూట్ల కంపెనీకి రాష్ట్రప్రభుత్వ జీవో నెంబరు 30ననుసరించి దాదాపు 96 ఎకరాలను ధారాదత్తం చేసింది. ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో భాగంగా ఎకరా కేవలం ఒక్కరూపాయికి మాత్రమే అంటే మొత్తం 96 ఎకరాలను రూ. 96 రూపాయలకు విక్రయించడాన్ని ఆయన తప్పుబట్టారు.
96 ఎకరాల భూమి విలువ ప్రస్తుతం రూ. 30 కోట్ల పైమాటేనని, ఇంత విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు కంపనీకి విక్రయించడం వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. వీరిరువురికి రూ. 15 కోట్ల లెక్కన ముడుపుల ముట్టాయని ఆయన తెలిపారు. భూమి అమ్మకాన్ని నిలుపుదల చేసి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా గత నెల 29న సుళ్ళూరు పేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 96 ఎకరాల భూమిని ప్రభుత్వం అపాచీ కంపెనీకి ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చినట్లు సమాచారం. కాగా ఏపీఐఐసీ ఎకరా ఒక్క రూపాయికే మొత్తం 96 ఎకరాలను అపాచీ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసిందని తెలియగానే స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.