ఇకపై ఓదార్పు కాదు.. పరామర్శ యాత్ర: వైఎస్.జగన్

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి పంథాలో మార్పు వచ్చింది. ఆయన తన తనదైన శైలిలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఒక వైపు అధిష్టానం మాటను గౌరవిస్తూనే మరోవైవు.. తాను తలపెట్టిన యాత్రను యధావిధిగా కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఇందుకోసం ఆయన తొలిదఫా పూర్తి చేసిన ఓదార్పు యాత్రకు స్వల్పంగా పేరు మార్చి, పరామర్శ యాత్రగా నామకరణం చేయనున్నారు. ఆపదలో ఉన్న తన ప్రత్యర్థులను పరామర్శించడం, తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక అశువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించడం జగన్ కొత్త వ్యూహంలో ఓ భాగంగా మారింది.

ఈ పరామర్శ యాత్రకు ఇప్పటికే ఆయన శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమలాపురం ఎంపీ హర్షకుమార్‌ను జగన్ పరామర్శించారు. చడీచప్పుడు కాకుండా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రోడ్డు మార్గంలో వచ్చారు.

అక్కడ నుంచి విజయవాడకు వచ్చారు. తిరిగి హైదరాబాద్ వెళుతూ నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఓ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు జగన్ వస్తున్నట్లు తెలియగానే... నకిరేకల్, నార్కెట్‌పల్లి, చిట్యాలలో ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే మరో వర్గం జగన్ రాకను వ్యతిరేకించింది. అయినప్పటికీ జనగ్ యధావిధిగా నల్గొండ జిల్లాలో పర్యటించారు.

ఇప్పటికే వచ్చే నెల ఎనిమిదో తేదీ తర్వాత తన నిర్ణయం ఉంటుందని, ఆ సమయంలో తనకు సహకరించాలని తన అనుచరులకు, హితులకు, సన్నిహితులను జగన్ కోరినట్టు సమాచారం. అప్పటి వరకు వేసి చూసే ధోరణితో ఉండాలని జగన్ వారితో అన్నారు. ఆ తర్వాత తన ప్రతాపం చూపాలనే తలంపులో కడప ఎంపీ ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి