కొండ్రు మురళి : పొన్నం - గుత్తా - కోమటిరెడ్డిలపై ఫైర్!

శనివారం, 10 ఆగస్టు 2013 (16:31 IST)
File
FILE
రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పరుష పదజాలంతో మాట్లాడిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలపై మంత్రి కొండ్రు మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్‌ల మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించారు.

ఇదే అంశంపై ఆయన మీడియాతో మట్లాడుతూ ముఖ్యమంత్రిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేసీఆర్ వ్యాఖ్యలు అసమంజంగా ఉన్నాయన్నారు. కొందరు తెలంగాణనేతలు సీమాంధ్ర ప్రజలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారన్నారు.

కోమటిరెడ్డి, పొన్నం వంటివారి వ్యాఖ్యలు గర్హనీయమని, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకునేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. జలయజ్ఞం పనుల్లో కోమటిరెడ్డి ఎన్ని కోట్లు సంపాదించారో అందరికీ తెలుసున్నారు. పొన్నం ప్రభాకర్ 2004లో సీటు రాకుంటే ఊసరవెల్లిలా మారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసిన విషయాన్ని మరిచిపోరాదన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని డీఎస్ కూడా సీఎంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడుతూ విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వారో అందరికి తెలుసున్నారు.

వెబ్దునియా పై చదవండి