గాంధీభవన్ గబ్బిలాల నిలయంగా మారుతుంది: అంబటి

FILE
వై.ఎస్. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలో పాల్గొనే పార్టీ నాయకులను సస్పెండ్ చేస్తూ పోతే పార్టీలో ఎవ్వరూ మిగలరని కాంగ్రెస్ బహిష్కృత నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చివరకు గాంధీభవన్ గబ్బిలాల నిలయంగా మారుతుందని ఆవేశంగా అన్నారు.

ఓదార్పు యాత్ర వ్యక్తిగతమని అధిష్టానం చెప్పిన నేపథ్యంలో, ఆ యాత్రలో పాల్గొంటే తప్పేముందని అంబటి ప్రశ్నించారు. పార్టీ విజయంలో ప్రస్తుతం సస్పెండ్ అయిన నాయకుల పాత్ర కూడా ఉందని ఆయన చెప్పారు.

తెదేపాకు వణుకు పుట్టిస్తున్న ఓదార్పు యాత్రను అడ్డుకోవడం సరికాదని, అలా అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీ లాభం చేకూరుతుందని, అలా జరగడమే పీసీసీ నాయకత్వం అభిమతమా? అని అంబటి ప్రశ్నించారు.

కడప పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనడమే తప్పైతే ఆ యాత్రను నిషేధించాలని ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)కి సవాలు విసిరారు. పనిలో పనిగా పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేరెత్తకుండా.. పీసీసీ నాయకత్వం అంటూ అంబటి విమర్శల వర్షం కురిపించారు.

జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నందుకే పీసీసీ నాయకత్వం పార్టీ నేతలపై చర్యలు తీసుకుంటుంటే.. పీసీసీ గాంధీ భవన్ కార్యాలయం తప్పిదాల నిలయంగా, గబ్బిలాల ఆవాసంగా మారే ప్రమాదముందని అంబటి వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి