"గ్రేటర్" ఎన్నికల ప్రచారానికి వైఎస్.జగన్ దూరం!?

శనివారం, 7 నవంబరు 2009 (18:00 IST)
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. గ్రేటర్ టిక్కెట్ల కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయని, డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

ఇటువంటి తరుణంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేయడం వల్ల తన పేరు ప్రతిష్టలకు నష్టం వాటిల్లుతుందనే ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా, గ్రేటర్ టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం జరిగినట్టు స్వయానా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలే ఆరోపణలు చేస్తున్నారు. ఈ టిక్కెట్ల కేటాయింపు రభస రాజధానికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ ప్రచారానికి కాస్త దూరంగా ఉండటమే మంచిదని ఆయన సన్నిహితులు సూచన చేశారు.

అయితే, ఆయన అనుచర వర్గానికే చెందిన మరికొందరు మాత్రం శేరింగపల్లి, కూకట్‌పల్లి, కుతుబుల్లాపూర్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని కోరుతున్నారు. కానీ, ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి టిక్కెట్ల కేటాయింపులో తన సిఫార్సులు కూడా బుట్టదాఖలు చేశారని ఆరోపిస్తున్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి