చిరూ.. కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటావ్: నాగం ప్రశ్న

ప్రజారాజ్యం పార్టీ-కాంగ్రెస్ పార్టీల పొత్తుపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఏర్పడిన పొత్తు అవగాహన అనైతికమైనదిగా ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ అభివర్ణించారు. కరుడుగట్టిన సమైక్యవాది అయిన చిరంజీవి.. ద్వంద వైఖరిని అవలంభిస్తున్న కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు.

తాజా రాజకీయ పరిణామాలపై నాగం మాట్లాడుతూ కాంగ్రెస్‌-ప్రరాపాల మధ్య కుదిరిన అవగాహనం ఏ ప్రాతిపదికన కుదిరిందో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పొత్తుపై నోరు మెదపని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు.. తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడాన్ని నాగం తప్పుబట్టారు.

కాంగ్రెస్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్, తెరాసల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపోతే తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోతే తాము కూడా చేయబోమన్నారు. కాంగ్రెస్‌ పోటీ చేయకుండా ఒప్పించాల్సిన నైతిక బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు.

తెరాస శాసనసభ్యులతో కేసీఆర్ ఏకపక్షంగా రాజీనామాలు చేయించారని ఆయన విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను, ఉద్యమాన్ని కేసీఆర్ తన స్వార్థం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి