జగన్ అరెస్టుపై జోరుగా సాగుతున్న బెట్టింగులు!!

శనివారం, 10 సెప్టెంబరు 2011 (12:38 IST)
FILE
అవినీతికి పాల్పడిన ప్రముఖులు అరెస్టవుతున్న నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. గనుల రారాజు గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుకు అనంతరం జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అరెస్టవుతారా, అయితే ఎప్పుడవుతారనే విషయాలపై కడప జిల్లాలో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయని ఓ ఆంగ్ల పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. అదీ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై జోరుగా బెట్టింగులు సాగుతున్నట్లు ఆ పత్రిక రాసింది.

కడప పట్టణంలోనే కాకుండా ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి ప్రాంతాల్లో ఈ బెట్టింగులు జరుగుతున్నట్లు ఆ పత్రిక రాసింది. జగన్ వారంలో అరెస్టవుతారనే దానికి, పక్షం రోజుల్లో అరెస్టవుతారనేందుకు వేర్వేరు రేట్లు పలుకుతున్నాయని తెలిసింది. జగన్ సెప్టెంబర్ 15వ తేదీన అరెస్టవుతారని కొంత మంది కచ్చితంగా బెట్టింగ్ కడుతున్నారని ఆ పత్రిక రాసింది.

వెబ్దునియా పై చదవండి