ఢిల్లీలో పోటా పోటీగా రాష్ట్ర రాజకీయాలు

శుక్రవారం, 20 ఫిబ్రవరి 2009 (13:15 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు వైఎస్.జగన్ అవినీతిపై జాతీయ స్థాయిలో మహాకూటమి నేతలు యుద్ధభేరీ మోగించారు. వైఎస్ కుటుంబ అవినీతిపై పుస్తకాలు ముద్రించి, సీడీలు రూపొందించి దేశ రాజధానిలో పంపిణీలు చేస్తున్నారు.

ఇందుకోసం ఢిల్లీలో తిష్టవేసిన మహాకూటమి నేతలైన చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్ రావు, రాఘవులు, నారాయణలు అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి, వైఎస్ కుటుంబ సభ్యుల అవినీతిపై వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. గురువారం ఇన్‌ఛార్జ్ ప్రధాని ప్రణబ్ ముఖర్జీ, ప్రతిపక్ష అగ్రనేత అద్వానీలతో సమావేశమైన మహాకూటమి నేతలు, తమ వాదనను వినిపించారు.

అలాగే, శుక్రవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలుసుకుని వైఎస్ అవినీతిపై విచారణ జరిపించాలని వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని ఇంతటితో వదిలి పెట్టబోమన్నారు. రాష్ట్రానికి చేరుకోగానే రాష్ట్ర వ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

ఇదిలావుండగా, మహాకూటమి నేతలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు ప్రతిచర్య చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్పడిన అవినీతిపై ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం రాజమండ్రి స్థానం కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలోని ఎంపీల బృందం ఢిల్లీకి చేరుకుంది.

వెబ్దునియా పై చదవండి