తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి: కావూరి

ఆదివారం, 10 జనవరి 2010 (13:24 IST)
తెలంగాణ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, ఆ ప్రాంతానికి చెందిన సమర్థవంతమైన నేతను ఉప ముఖ్యమంత్రి చేసే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావు సూచన ప్రాయంగా వెల్లడించారు.

దీనిపై ఆయన ఆదివారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతానికి చెందిన సమర్ధుడైన నేతను ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలిపారు. ఇలా చేస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వాదం బలహీన పడే అవకాశం లేకపోలేదన్నారు.

ఇకపోతే.. రాష్ట్రంలోని రాయలసీ, కోస్తా, ఉత్తరాంధ్రతో పోల్చితే తెలంగాణలోనే ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ విషయం తాను చెప్పడం లేదని ప్రభుత్వ గణాంకాలే నిర్ధారిస్తున్నాయని పేర్కొన్నారు. సెంటిమెంట్ ఆధారంగా దేశంలో రాష్ట్రాల విభజన సాగితే వందల సంఖ్యలో రాష్ట్రాలు ఇవ్వాల్సి వస్తుందన్నారు.

ఆత్మగౌరవ నినాదం తెలంగాణ ప్రజలది కాదని, నేతలకు మాత్రమే అంటున్నారన్నారు. దీని ప్రకారంగా చూసుకుంటే హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్న ముస్లిం సోదరులకు కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి వస్తుందని కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి