తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెస్-టీడీపీలు కుట్ర : టీఆర్ఎస్

శుక్రవారం, 9 మార్చి 2012 (09:41 IST)
IFM
FILE
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అడ్డుపెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుట్ర పన్నుతున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వినోద్ కుమార్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన తీర్మానానికి, ఆ ఎన్నికల ఫలితాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ... యూపీ ఎన్నికలు విభజన అంశంపై జరుగలేదన్నారు. కానీ.. సీమాంధ్రకు చెందిన రాజకీయ నేతలు ఈ ఎన్నికల ఫలితాలకు తెలంగాణకు లింక్‌పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. యూపీ ఎన్నికల్లో గెలుపొందిన ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ కూడా యూపీ రాష్ట్ర విభజనను ఎన్నడూ వ్యతిరేకించలేదని ఆయన గుర్తు చేశారు.

యూపీని నాలుగు ముక్కలు చేయాలంటూ మాయావతి అసెంబ్లీలో చేసిన తీర్మానం వల్లే బీఎస్పీ ఓడిపోయినట్టు సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ను అడ్డుకునే కుట్రతోనే ఇదంతా జరుగుతోందని, ఈ కుట్రలో కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన భాగస్వాములని ఆయన ధ్వజమెత్తారు.

వెబ్దునియా పై చదవండి