తెలంగాణలో ప్రజారాజ్యం ఖాళీ: విజయశాంతి జోస్యం

ఆదివారం, 10 జనవరి 2010 (16:47 IST)
తెలంగాణ ప్రాంతంలో ప్రజారాజ్యం దుకాణం ఖాళీ అయిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ విజయశాంతి జోస్యం చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిన చిరంజీవి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారన్నారు. అందువల్ల ఇకపై తెలంగాణ ప్రాంతంలో ప్రరాపా దుకాణం కట్టేసినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆదివారం విజయశాంతి ఆధ్వర్యంలో పలువురు ప్రరాపా నేతలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక తెలంగాణ నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవి సమైక్యాంధ్ర అని తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆమె ధ్వజమెత్తారు.

కేంద్రం చర్చలు, కమిటీల పేర సమయం వృధా చేయకుండా తక్షణమే తెలంగాణపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని విజయశాంతి డిమాండ్‌ చేశారు. తమ అధినేత కేసీఆర్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తారన్న వార్తలు అవాస్తవమని విజయశాంతి అన్నారు.

హైదరాబాద్‌లోని చిత్రపరిశ్రమను విజయవాడ లేదా విశాఖపట్నంకు తరలించుకోవచ్చన్నారు. ఇందులో తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారిలో సింహ భాగం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నవారేనని విజయశాంతి జోస్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి