నావి "పుల్ల విరుపుడు" మాటల్లా ఉంటాయి: కేసీఆర్

FILE
తనకు తెలుగు సాహిత్యమంటే చాలా ఇష్టమని, అందుకే తన మాటలు పదునుగా, వ్యంగ్యంగా ఉంటాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు.

శనివారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలకు ప్రతి విమర్శలు చేశారు. పొన్నాల విమర్శలను చదివి వినిపించి ఖండించారు.

తాము తప్పులు చేయమని, ఒకవేళ తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని కేసీఆర్ అన్నారు. తాను మొదటి నుంచి అలాగే మాట్లాడుతానని, తనకు ఎలాంటి దుర్భుద్ధి లేదన్నారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుని తాను ఎప్పుడూ సమర్థించలేదని మంత్రి పొన్నాల చెప్పారు. అక్రమ ప్రాజెక్టులు కట్టామని పొన్నాల కోర్టులో ఒప్పుకుంటారా? అని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ప్రభుత్వం తప్పిదం వల్లే వరదలు వచ్చాయని కేసీఆర్ ఆరోపించారు. కృష్ణానది ద్వారా వచ్చిన ఉపద్రవం భవిష్యత్‌లో మళ్లీ రాకూడదనే తాను సూచనలు చేస్తున్నానని చంద్రశేఖర రావు చెప్పారు. రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల 5శాతం ఉంటే., మిగిలినదంతా ప్రభుత్వ తప్పిదమేనని కేసీఆర్ విమర్శించారు.

ఇదిలా ఉంటే.. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు మతిభ్రమించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అందుకే పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని చెప్పారు. శనివారం విలేకరులతో పొన్నాల మాట్లాడుతూ.. కేసీఆర్ మానసిక పరిస్థితి బాగోలేదని, అందుకే నోరు, కాలు జారుతున్నాడని విమర్శించారు.

జలయజ్ఞంపై ఏ వేదికపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని పొన్నాల ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ లాంటి మానసిక పరిస్థితి బాగోలేనివారితో సాంకేతిక అంశాలు ఎలా చర్చిస్తారని పొన్నాల ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి