పదవితో తెలంగాణాను చల్లార్చారనుకోను: డిప్యూటీ సీఎం

శుక్రవారం, 10 జూన్ 2011 (19:20 IST)
తనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణాను చల్లబరిచామని కాంగ్రెస్ హైకమాండ్ అనుకోవడం లేదని ఉపముఖ్యమంత్రిగా ఎంపికైన దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తన బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తానని చెప్పారు.

తెలంగాణా రాష్ట్ర సాధనకోసం తీసుకరావల్సిన ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తమ అధిష్టానం ఏనాడూ ఒక్క ముక్క కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణా ప్రజాప్రనిధులు తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.

తెలంగాణా ప్రజల ఆకాంక్షను హైకమాండ్ గుర్తించిందనీ, తగిన పరిష్కార మార్గం కోసం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఇక ఉపముఖ్యమంత్రిగా తాను ప్రభుత్వపరంగా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేవిధంగా కృషి చేస్తానన్నారు. ప్రజల మధ్య నెలకొన్న వివక్షను తొలగించి అందరికి సమానత్వాన్ని తీసుకవచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు.

జేఏసీ విధించిన డెడ్‌లైన్‌పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... జేఏసీతో తమకు సంబంధం లేదన్నారు. వారి ప్రణాళికలను వారు వేసుకుంటారనీ, ప్రభుత్వపరంగా తాము చేయాల్సింది చేసుకుంటూ పోతామన్నారు.

తనపై నమ్మకముంచి ఉపముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఇతర సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

వెబ్దునియా పై చదవండి