పేదలు-రైతుల వ్యతిరేక బడ్జెట్: కె.ఎర్రన్నాయుడు

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (13:51 IST)
File
FILE
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.ఎర్రన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పేదల, రైతుల వ్యతిరేక బడ్జెట్‌గా అభివర్ణించారు.

బడ్జెట్‌పై ఆయన ఢిల్లీ నుంచి స్పందన వ్యక్తం చేస్తూ.. అప్పు చేసి పప్పుకూడు తినాలనే చందంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందన్నారు. ఇప్పటికే, నిత్యావసర వస్తు ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంచడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.

ఈ పన్ను పెంపు వల్ల తక్షణం పెట్రోల్, డీజల్ ధరలు పెరగుతాయన్నారు. ఈ పెంపు పరోక్షంగా సరకుల రవాణాపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. ఇకపోతే.. జాతీయ గ్రామీణ హామీ పథకం తమ మానస పుత్రికగా యూపీఏ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్నారు. ఈ పథకానికి కూడా నిధులు అంతంతమాత్రంగా విదిల్చారన్నారు.

ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం నలభై వేల కోట్ల రూపాయలను కేటాయించి చేతులు దులుపుకున్నారన్నారు. అంతేకాకుండా, దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ అన్ని తరగతుల ప్రజలను ఈ పథకం కింద చేర్చారన్నారు.

దీనివల్ల ఈ పథకం కింద యేడాదిలో వంద రోజులు పని దినాలు కల్పించేందుకు బదులు ముఫ్పై రోజులు కూడా పని కల్పించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే, గ్రామీణాభివృద్ధికి కూడా నిధులు నామమాత్రంగా పెంచారన్నారు. అందువల్లే ఈ బడ్జెట్‌ను పేదల, రైతుల వ్యతిరేక బడ్జెట్‌గా పేర్కొంటున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి