ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్: తగ్గని బియ్యం ధరలు

బియ్యం ధరలను తగ్గించాలని ప్రభుత్వ హెచ్చరికలను బియ్యం వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నట్టు నటిస్తూనే.. హోం డెలివరీ పేరిట తమకు ఇష్టమైన ధరలకు బియ్యం అమ్ముతూ రెండు చేతులా అర్జిస్తున్నారు. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

మేలు రకం బియ్యం కావాలనుకునే వినియోగదారుల ఇళ్లకు నేరుగా సరఫరా చేస్తున్నారు. వారం పది రోజుల నుంచి ఇదో కొత్త రకం దందా రాష్ట్ర రాజధానిలో సాగుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు నాణ్యత లేని బియ్యం విక్రయిస్తూ, వినియోగదారుల ఇళ్లకు మేలు రకం బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.

గత నెల నుంచి నగరంలో బియ్యం ధరలు తగ్గించి విక్రయాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి నగరంలో దుకాణాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీ సమయంలో కిలో బియ్యం ధర రూ.20కు అమ్మిన వ్యాపారులు తనిఖీ అనంతరం యధాతథంగా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో 22 రూపాయల నుంచి 26 రూపాయల వరకు బియ్యం ధరలు పలుకుతున్నాయి. ఎవరైనా కిలో 20 రూపాయల బియ్యం లేవా? అని అడిగితే దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యం, నూకల బియ్యం చూపిస్తూ పబ్బం గడుపుతున్నారు.

ఇదిలావుండగా.. కిలో బియ్యం రూ.18 నుంచి రూ.19కు వ్యాపారులకు పంపిణీ చేయాల్సిన మిల్లర్లే రూ.21 నుంచి రూ.25 చొప్పున కిలో బియ్యం అందిస్తున్నారని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. కనీసం రూపాయి లాభం చూసుకోనిదే ఎలా అమ్మగలమని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో తక్కువ ధరకు విక్రయించడం సాధ్యపడదని కొంత మంది వ్యాపారులు బియ్యం అమ్మకాలను నిలిపివేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి