తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిలయన్స్ సంస్థలకు ఉన్న సంబంధాలపై ఆరా తీయాలని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రిలయన్స్ సంస్థపై ఎవరో కొందరు దాడులు చేస్తే చంద్రబాబు ఉలిక్కిపడటానికి గల కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
రిలయన్స్ సంస్థతో చంద్రబాబుకు ఉన్న అనుబంధం ఏమిటో బయటకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. రిలయన్స్ సంస్ధలపై జరిగిన దాడులపై చంద్రబాబు మీడియా ముందు మాట్లాడిన తీరు చూస్తే సగటు మనిషికి కూడా ఈ సందేహం ఉత్పన్నమవుతుందన్నారు.
అందువల్ల చంద్రబాబుకు రిలయన్స్‌కు ఉన్న సంబంధంపై ఆరా తీయాలని ఆయన కోరారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు, అల్లర్లు, బంద్‌లు, రాస్తారోకో, రైల్ రోకోలతో ప్రజా జీవితానికి స్తంభించి పోతే పట్టించుకోని చంద్రబాబు రిలయన్స్ సంస్థపై రాళ్ళు పడితే మాత్రమే బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
దీనిపై మీడియా ప్రతినిధులే ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇకపోతే.. మీడియాలో ప్రాథమిక ప్రమాణాలు తుంగలోతొక్కిన ఘనత ఈనాడు యాజమాన్యానికే దక్కుతుందన్నారు. వార్తకు, ప్రకటనకు, కథకు, కథనానికి తేడా లేకుండా చేసింది ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానలే అని ఉండవల్లి ఆరోపించారు.