బొత్స సమైక్యం... డిప్యూటీ సీఎం తెలంగాణం... మరి సీఎం...?!!

బుధవారం, 10 జులై 2013 (18:17 IST)
FILE
తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పే మాట, ఇచ్చే నివేదిక కీలకం కానుంది. పీసీసి చీఫ్ బొత్స సత్యనారాయణ డైరెక్టుగానే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకూ ప్రయత్నం చేస్తానని చెప్పేశారు. ఏడుకొండలవాడి వద్దకెళ్లి ఇదే అంశాన్ని మొక్కుకున్నట్లు కూడా చెప్పారు. కనుక ఆయన సమైక్యాంధ్ర కోసమే చెపుతారని స్పష్టమయింది.

పైగా తెలంగాణ ఇస్తే తలెత్తే లాభనష్టాలను కూలంకషంగా తన నివేదికలో పొందుపరిచి మరీ ఇస్తానని అంటున్నారు. కనుక ఆయన ఏమాత్రం తెలంగాణాకు అనుకూలంగా చెప్పే అవకాశాలు చాలా అరుదుగానే ఉన్నాయని అనుకోవచ్చు. ఇక డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ విషయానికి వస్తే... ఇప్పటికే ఆయన ఎన్నోసార్లు సీమాంధ్ర ప్రాంతం నుంచే ఎక్కువ ముఖ్యమంత్రులు పనిచేశారనీ, తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురయిందని చెప్పారు. కనుక ఆయన స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విషయమే ఎటూ తేలకుండా ఉంది. ఇప్పటివరకూ తాను తెలంగాణకు అనుకూలమా... లేదంటే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటానంటారా అనేది ఎంతమాత్రం వెల్లడించలేదు. కనుక ఆయన ఇచ్చే నివేదికను బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందా... ముక్కలవుతుందా తేలిపోనుంది.

వెబ్దునియా పై చదవండి