రణరంగంగా అనంతపురం ఆర్ట్స్ కాలేజీ హాస్టల్!

శుక్రవారం, 6 డిశెంబరు 2013 (11:49 IST)
File
FILE
అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ రణరంగంగా మారింది. ఈ హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను హాస్టల్ నుంచి బలవంతంగా బయటకు పంపడానికి పోలీసులు ప్రయత్నిస్తుండటంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులకు మద్దతుగా తెదేపా నేతలు పరిటాల సునీత, మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసులు తదితరులు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణానికి చేరుకున్నారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ, తెదేపా నేతలు కాలేజీ ముందు బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారిపోయింది.

జిల్లా వ్యాప్తంగా బంద్ తీవ్రంగా జరుగుతున్న సమయంలో, విద్యార్థులను హాస్టల్ నుంచి వెళ్లిపొమ్మంటే, వారు ఎక్కడకు వెళతారని పరిటాల సునీత ప్రశ్నించారు. కనీసం భోజనం కూడా చేయనీయకుండా పోలీసులు భయపెడుతున్నారని ఆమె మండిపడ్డారు.

విద్యార్థులు ఇక్కడ నుంచి ఎక్కడకు వెళ్లరని, వారికి మద్దతుగా తామంతా ఇక్కడే ఉంటామని, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాలేజీ ఆవరణ నుంచి పోలీసులు వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతలో విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి