విభజన జరగదని చెప్పేందుకు కేసీఆర్ నివేదిక చాలు

FILE
శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించే గడువు నేటితో ముగియనుండటంతో నాయకులు, ఆయా ప్రజా సంఘాలు తమ తమ నివేదికలను కుప్పలు తెప్పలుగా కమిటీ ముందు కుమ్మరిస్తున్నాయి. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ రోజు కూడా మరో నివేదిక ఇచ్చారు. దీంతో ఆయన ఇప్పటివరకూ కమిటీకి సమర్పించిన నివేదికల సంఖ్య 9కి చేరుకుంది.

నివేదిక సమర్పించన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణాపై కేసీఆర్ ఇచ్చిన నివేదిక చూస్తే ఇక ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ ముక్కలు చేయలేరని అర్థమవుతుందన్నారు. నిజాం ప్రభువులనాటి రాష్ట్రం కావాలని కేసీఆర్ శ్రీకృష్ణ కమిటీకి తన నివేదిక ద్వారా అడుగుతున్నారనీ, అదెలా సాధ్యమవుతుందో ఆయనే చెప్పాలన్నారు.

తెలంగాణాను అడ్డుకునేందుకు కోటి మంది లగడపాటిలు దిగి రావాలన్న కేసీఆర్‌కు, తెలంగాణా రాకుండా ఉండేందుకు ఆయన సమర్పించిన నివేదిక ఒక్కటి చాలని లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తానేదో పొరుగు రాష్ట్రానికి కరెంటు అమ్ముకుంటూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నట్లు గత రెండు మూడు రోజులుగా తెరాస నాయకులు విమర్శించడాన్ని లగడపాటి కొట్టి పారేశారు.

ల్యాంకోకు రాజీనామా చేసి ఏడు సంవత్సరాలు దాటిపోయిందని చెప్పుకున్నారు. అయినా ఏసీ గదుల్లో కూర్చుని కోట్లు వెనకేసుకుంటున్న తెరాస నాయకులకు తనను విమర్శించే హక్కు లేదని లగడపాటి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి