వైఎస్సార్ - జగన్ కలిసే అక్రమ "ఆపరేషన్" చేశారు: సీబీఐ

శనివారం, 20 ఆగస్టు 2011 (13:06 IST)
FILE
వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆయన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును కూడా సీబీఐ చేర్చడంతో కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది. వైఎస్సార్ తన కుమారుడు జగన్‌తో కలిసి కొంతమంది పెట్టుబడిదారులతో కలిసి నేరపూరిత కుట్ర చేశారని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం.

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది పెట్టుబడిదారులకు పలు రకాలైన తాయిలాలు ఇచ్చి ప్రతిగా తన కుమారుని కంపెనీల్లోకి పెట్టుబడులు రాబట్టారని, తద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపించింది.

ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్ లు తదితర కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ఈ "ఆపరేషన్" జరిగిందని సీబీఐ ఆరోపించింది. మొత్తమ్మీద దివంగత నేత వైఎస్సార్ తన కుమారుడు జగన్ తో కలిసి అక్రమాలకు పాల్పడ్డారనేది సీబీఐ ఆరోపణగా ఉంది. అయితే ఇదంతా మంత్రి శంకర్రావు అనే వ్యక్తి రాసిన పాఠమేననీ, దాన్ని తిరిగి రాసి సీబీఐ పేర్కొందని జగన్ పత్రిక సాక్షి వ్యాఖ్యానించడం కొసమెరుపు.

వెబ్దునియా పై చదవండి