వ్యతిరేకిగా చిత్రీకరిస్తే కాంగ్రెస్‌కు నూకలు చెల్లినట్టే : వైకాపా

మంగళవారం, 10 ఏప్రియల్ 2012 (18:54 IST)
File
FILE
దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరిస్తే కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లినట్టేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై ఆ పార్టీ ఎస్.సి విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు, ఎస్.సి కమిషన్ మాజీ ఛైర్మన్ మేరుగ నాగార్జునలు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దళిత దళారులైన రాజ్యసభ సభ్యుడు జె.డి.శీలం, మంత్రి కొండ్రు మురళీమోహన్, లోక్‌సభ సభ్యుడు హర్షకుమార్ వై.ఎస్‌పై అభూతకల్పనలు, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఏ ఒక్క దళితుడూ సహించజాలరన్నారు.

అంబేద్కర్ పేరుతో కళాశాల పెడతానని చెప్పి వెయ్యి ఎకరాలు కేటాయింపజేసుకున్న కొండ్రు మురళి, అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాలను పడగొట్టిన నిందితులను అరెస్టు చేయకుండా ఆపిన హర్షకుమార్‌లు వైఎస్‌ను విమర్శించడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఐదేళ్లలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలోబియ్యం, ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణం, విద్యార్థులకు ఫీజు చెల్లింపు వంటి పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీనవర్గాలు మైనారిటీలు పెద్ద ఎత్తున లబ్ది పొందారనీ అందుకే వై.ఎస్ చనిపోయిన తర్వాత కూడా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.

వై.ఎస్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చుతుంటే సహించలేని జగన్.. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించి ఆ పార్టీని వీడిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పెట్టుకుంటే ఏడాదిలోపే అశేష జనాదరణ పొందారనీ అది చూసి ఓర్వ లేక అధిష్టానం ప్రోత్సాహంతో వీరు విమర్శలు మొదలు పెట్టారని వారు దుమ్మెత్తి పోశారు.

వెబ్దునియా పై చదవండి