విజయవాడలో 8వేల మందికి ఈసారి చేతికి రాలేదు. ఇంటింటికీ వచ్చిన వలంటీర్లు జాబితా చూసి పింఛన్ పెండింగ్‌లో ఉందని చెప్పారు. రేషన్ బియ్యం వచ్చే నెల వస్తాయో రావో చెప్పలేమన్న సందేహాన్ని లబ్ధిదారుల ముందుంచి వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు వాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
భోజనం ముందు కూర్చున్నా మనస్సు పూర్తిగా నాలుగు ముద్దలు మింగలేని పరిస్థితి. నగర పరిధిలో మొత్తం 8 వేల పింఛన్లు రద్దై పోయాయి. మరో 70వేల తెలుపు రేషన్ కార్డులు ఉంటాయో, ఊడతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం తీరు ఇప్పుడు నగరంలో మొత్తం గందరగోళానికి దారి తీసింది.
ప్రస్తుతం పింఛన్లు ఆగిపోగా, వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యంలోనూ కోత పడుతుందని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.
భౌతికంగా కనిపించని భూమి కాగితాలపై కనిపిస్తోంది. లేని ఉద్యోగమూ కాగితాలపైనే ఉంటోంది. ఒకరిద్దరికి జరిగితే ఇవన్నీ పొరపాటు అనుకోవచ్చు. ప్రస్తుతం లబ్ధిదారులుగా ఉన్న వాళ్లంతా అనర్హులుగా మారుతుంటే దాన్ని ఏమనుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు.
నవశకం పేరుతో వలంటీర్లు ఇంటింటికి వచ్చి సర్వే నిర్వహించారు. ఆ సమయంలో ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లుల వివరాలను రాసుకుని వెళ్లారు. సొంతిళ్లు ఉన్న వారి ఇంటి పన్నుల రశీదులను తీసుకున్నారు.
మరోపక్క వివిధ శాఖల వద్ద ఉన్న ఆన్‌లైన్ డేటాను, వలంటీర్లు సేకరించి కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేసిన డేటాను క్రోడీకరించి కొత్తగా ఒక జాబితాను తయారు చేశారు.
ఇదంతా మొత్తం తప్పుల తడకలుగా మారిపోయింది. వేలాది మంది అర్హులు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకు వస్తున్నారు.
వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదంతా పెద్ద గోలగా మారడంతో అభ్యంతరాలను తెలియజేయడానికి వీఎంసీ అధికారులు ప్రత్యేక కౌంటర్లను మూడు నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేశారు.
ఇక్కడ లబ్ధిదారుల నుంచి ఆర్జీలు తీసుకుంటున్నా, అవి పరిష్కారమవుతాయన్న విశ్వాసం వారిలో కనిపించడం లేదు.