గుంటూరులో ఏడేళ్ల పాపపై అత్యాచారం... నిందితుడి కోసం గాలింపు...

బుధవారం, 30 జనవరి 2019 (12:53 IST)
దేశంలో స్త్రీల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది, అత్యాచార దుర్ఘటనలు మరిన్ని జరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు, మద్యం తాగి పసిపిల్లలను కూడా విడిచిపెట్టడం లేదు. ఇలాంటి ఘటన గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం తుమురుకోటలో చోటుచేసుకుంది. 
 
జయరాజ్ అనే వ్యక్తి బాగా మద్యం తాగి కన్నబిడ్డ వయస్సు ఉన్న ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలికకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. నేరస్థుడిని పట్టుకోవడానికి అతని ఇంటికి వెళితే అప్పటికే పరారయ్యాడు.
 
స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. బాధితురాలు బంధువులతో కలిసి స్థానికులు కూడా మాచర్ల బస్టాండు వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళన విరమించాలని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు