ఇకపై పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌లకు కూడా ఆధార్ నంబరును తప్పనిసరి చేయనుంది. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలతోపాటు మరికొన్నింటికి తప్పనిసరి అయిన విషయం తెల్సిందే. అలాగే, ఇకపై పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు కూడా ఆధార్‌ను తప్పనిసరిగా చేయనుంది. వివాహాలను డిజిటలైజ్ చేయడంలో భాగంగా వధూవరుల వివరాలతోపాటు వారి ఆధార్ నంబర్లు, వేలిముద్రలు సేకరించాలని నిర్ణయించింది. దీనివల్ల రెండో పెళ్లిళ్లకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. అయితే ఇది కేవలం రిజిస్ట్రేషన్ పెళ్లిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆయా మతాచారాల ప్రకారం బయట జరుపుకునే వివాహాలకు ఇది వర్తించదు.
ప్రస్తుతం తెలంగాణలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెళ్లిళ్లను రికార్డ్ చేస్తున్నారు. ఈ కార్యాలయాల్లో రెండు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. వధూవరులు వచ్చి పెళ్లి చేయాలని కోరితే నెల రోజుల్లో వారికి వివాహం జరిపించి ధ్రువపత్రం ఇవ్వడం అందులో మొదటిది కాగా, బయట పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం రెండోది. ఈ వ్యవహారమంతా మాన్యువల్‌గా జరుగుతోంది. వారు చేసుకున్న దరఖాస్తులను తీసుకుని రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు.
దీంతో ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే పట్టుకోవడం కష్టంగా మారుతోంది. కొందరు రెండుమూడు సార్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా పట్టుబడడం లేదు. ఈ కారణంగానే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సమయంలో వధూవరుల నుంచి ఆధార్ నంబర్, వారి ఫొటోలు, వేలిముద్రలు అన్నీ సేకరించి ఆన్‌లైన్‌లో భద్రపరుస్తారు. ఇలా చేయడం వల్ల రెండో పెళ్లిళ్లకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. తొలుత ఈ విధానాన్ని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు.