కొత్త పింఛను మంజూరుకు 'ఆధార్‌ అప్‌డేట్‌ హిస్టరీ' తప్పనిసరి

శనివారం, 31 అక్టోబరు 2020 (20:29 IST)
కొత్తగా పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుదారు ఆధార్‌ కార్డులో వయసుకు సంబంధించి జరిగిన మార్పులు, చేర్పుల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అర్హులందరికీ సంతృప్తస్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొందరు ఆధార్‌ కార్డులో తమ వయసును మార్చుకుని పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులందాయి. దీంతో అనర్హులు లబి్ధపొందకుండా చూసేందుకు కొత్త నిబంధన తీసుకొచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి.

కొత్త నిబంధన ప్రకారం పింఛనుకు దరఖాస్తుచేసుకునేవారు తమ ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ హిస్టరీ ప్రింట్‌ అవుట్‌ కూడా సమర్పించాలి.
 
మార్పులు, చేర్పులు జరిగి ఉంటే.. ఆధార్‌ కార్డులో తక్కువ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారు వయసు అర్హత నిబంధనల ప్రకారం ఉంటేనే ఆ దరఖాస్తును తదపరి దశ పరిశీలనకు పంపుతారు. లేనిపక్షంలో సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్‌ స్థాయిలోనే తిరస్కరిస్తారు.

దరఖాస్తుదారుకి ఆధార్‌ కార్డు మంజూరు సమయంలో వయసు తప్పుగా నమోదై, తిరస్కరణకు గురైతే అప్పీలు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కలి్పంచింది. అలాంటి దరఖాస్తుదారు వయసు ధ్రువీకరణ పత్రాలతో గ్రామ, వార్డు సచివాలయంలో అప్పీలు చేసుకోవాలి.

ఈ అప్పీళ్లను ఎంపీడీవోలు లేదా మున్సిపల్‌ కమిషనర్లు స్వయంగా పరిశీలించి, అర్హులైతే పింఛను మంజూరుకు డీఆర్‌డీఏ పీడీలకు సిఫార్సు చేస్తారు.
 
ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు 12.42 లక్షలమందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఆధార్‌లో వయసు వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకుని అర్హత లేకున్నా పింఛను పొందినవారిని గుర్తించేందుకు నవంబర్‌లో పరిశీలన చేపడుతున్నట్టు సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. 

తక్కువ వయసు ఉండి, ఆధార్‌లో మార్చుకుని పింఛను పొందారని నిర్ధారణ అయితే వారి పింఛను తొలగిస్తామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు