అమెరికా భారీ తప్పిదం! ఆఫ్గ‌న్ల‌ జాబితా తాలిబాన్ల చేతికి?

శనివారం, 28 ఆగస్టు 2021 (11:28 IST)
అఫ్గానిస్థాన్‌ వ్యవహారంలో అమెరికా చ‌ర్య‌లు అంద‌రికీ ప్రాణ సంక‌టంగా మారుతున్నాయి. అమెరికా ఆఫ్గాన్ నుంచి తమ దళాలను హడావుడిగా ఉపసంహరించుకోవడం, కాబుల్‌ విమానాశ్రయం వ‌ద్ద అమెరిక‌న్ బ‌ల‌గాల‌ను మోహ‌రించ‌డం వరకు, ఎన్నో విషయాల్లో అగ్రరాజ్యం విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. 
 
తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించిన త‌రుణంలో, తమ పౌరులు, మిత్రదేశాల వారు, ఇన్నాళ్లూ తమకు సహకరించిన అఫ్గాన్ల పేర్లతో అమెరికా ప్రత్యేకంగా ఓ జాబితాను రూపొందించింది. ఆగస్టు 31లోగా తమ బలగాలను ఉపసంహరించుకోవాలి. వీరందర్నీ కాబుల్‌ నుంచి సురక్షితంగా తరలించేందుకు తాలిబన్లు సహాయపడతారని భావించింది. అమెరికా అధికారులు స్వయంగా వచ్చి, తాలిబన్ల చేతుల్లో ఈ జాబితాను పెట్టారు. ఈ లిస్టును తాలిబన్లకు అందిస్తే, ప్రజల తరలింపు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని అగ్రరాజ్యం భావించింది. 
 
కానీ తాలిబ‌న్లు ‘మేకవన్నె పులి’లా మారారు. అందర్నీ క్షమిస్తున్నామని చెబుతూనే, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టి జ‌ల్లెడ‌ప‌డుతున్నారు. గతంలో నాటో దళాలకు సహాయపడిన వారిని పట్టుకుంటున్న సంగతిని అమెరికా అధికారులు విస్మరించారు! ఇప్పుడు ఈ జాబితాను తాలిబన్లు ‘కిల్‌ లిస్ట్‌’గా పరిగణించే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జాబితా విషయమై అధ్యక్షుడు బైడెన్‌ను విలేకరులు ప్రశ్నించారు. అయితే, దీన్ని ఆయన ఖండించలేదు. ఈ విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని, అప్పుడప్పుడు తాలిబన్లకు జాబితాలు ఇస్తుంటామని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వ తీరుపై ఆ దేశ చట్టసభ్యులు, సైనికాధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. 
 
జాబితాలో పేర్లున్న అఫ్గాన్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. పౌరులకు ప్రమాదం తలపెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేశామంటున్నారు. కానీ, వారి చ‌ర్య రివ‌ర్స్ అవుతోంద‌ని ఊహించ లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు