నిమ్మగడ్డ తొలగింపుపై ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు

శుక్రవారం, 8 మే 2020 (17:46 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ను అర్థాంతరంగా పదవి నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పలువురు పిటిషన్లను దాఖలు చేశారు. వీటిన్నింటిపై హైకోర్టు విచారణ జరిపి, శుక్రవారంతో వాదనలు ఆలకించింది. సుధీర్ఘంగా విచారించిన అనంతరం నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. 
 
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా వాదప్రతివాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. 
 
243కె అధికరణలో పదవీకాలం రక్షణ ప్రస్తావన లేదని ఏజీ తెలిపారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని.. నిష్పక్షికంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని కోర్టుకు తెలిపారు. 
 
ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్న పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదని కోర్టుకు వాదనలు వినిపించారు. అంతేకాదు.. ఆర్డినెన్స్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణార్హం కాదని ఏజీ కోర్టుకు తెలిపారు.
 
ఇదిలావుంటే, ఎస్ఈసీ కనగరాజ్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్.ప్రసాద్ వాదనలు వినిపించారు. మాజీ న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం శుభపరిణామమని ఈ సందర్భంగా కోర్టుకు వినిపించారు. కమిషనర్ పదవిని వయసుతో ముడిపెట్టడం సరికాదన్నారు. 
 
అయితే, ఎన్నికల కమిషన్ తరుపున రాతపూర్వకంగా వాదనలు సమర్పించేందుకు మాజీ అడ్వకేట్ జనరల్ సీవీ మోహన్ రెడ్డి సమయం కోరారు. దీంతో ఆయనకు వచ్చే సోమవారం వరకు హైకోర్టు సమయం కేటాయించింది. అలాగే తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు