ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. అయితే, ఈ దఫా తీపి కబురు మాత్రం పదో తరగతి విద్యార్థులకు. పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా, ఎస్ఎస్సీ, ఏఎస్ఎస్సీ, ఒకేషనల్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు తెలిపింది.
దీంతో 2020 మార్చి నాటికి నమోదైన పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంగళవారం ఉత్వర్వులు విడుదల చేసింది. ఈ విద్యార్థులకు ఎలాంటి గ్రేడ్స్ లేకుండానే పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఫలితంగా సుమారు ఏపీలో 6లక్షల మందికి పైగా పదో తరగతి విద్యార్థులు ప్రభుత్వం నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు.
అన్ని రకాల పరీక్షలు వాయిదా : మంత్రి సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.
ముఖ్యంగా, ఎంసెట్, లా సెట్, ఈ సెట్, పీజీ సెట్ సహా 8 ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ ఎంట్రన్స్ టెస్టులను సెప్టెంబరు మూడో వారంలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. త్వరలోనే ప్రవేశ పరీక్షల కొత్త తేదీలతో షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేయాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి సురేశ్ తెలిపారు. అయితే, విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే జాతీయస్థాయిలో నీట్, జేఈఈ, ఐఐటీ ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా వేశారని మంత్రి సురేష్ గుర్తుచేశారు.