అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న దుబారా ఖర్చుల జాబితాలో తాజాగా మరో భారీ కేటాయింపు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే భవనాల ఆధునీకరణ పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న బాబు సర్కార్ తాజాగా విజయవాడలో పరిశ్రమల కార్యాలయానికి అద్దె నెలకు ఒక్క రూపాయిగా నిర్ణయించింది. ఇంకేం భేష్ అనుకుంటున్నారా? కానీ, ఆ కార్యాలయం రిపేర్లు, అన్ని హంగుల ఏర్పాటుకు మాత్రం పది కోట్లు ఖర్చు చేయనుంది.
ఈ కాంట్రాక్టును ఎలాంటి టెండర్లు లేకుండా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని విజయవాడలోని ముత్యాలంపాడుకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌కు చెందిన ఓ అంతస్తును పరిశ్రమల శాఖకు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
మొత్తం 10 వేల చదరపు అడుగులు ఉండే ఈ భవనానికి నామమాత్రపు (నెలకు ఒక్క రూపాయి) అద్దె చెల్లిస్తారు. ఈ భవనాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఓ నోడల్ ఆఫీసర్‌ను నియమించింది. అయితే, దీనికి రిపేర్లు, ఆధునికీకరణకు మాత్రం పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీనిని ఒక కాంట్రాక్టరుకు నామినేషన్ పద్ధతిలో టెండరు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి