మన బడి నాడు - నేడు కార్యక్రమంతో ఏపీలో చాలా బడుల రూపురేఖలు మారిపోయాయి. ఔరా...ఇది సర్కారు బడినా...లేక కార్పొరేట్ స్కూలా అన్నట్లు ఇక్కడి వాతావరణం మారిపోయింది. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే... అంతా చిందరవందరగా, చీదరగా ఉండేవి. కానీ ఇపుడు అదే పాఠశాలలు అందమైన భవనాలు, అధునాతన సౌకర్యాలతో విలసిల్లుతున్నాయి.
మండల విద్యాశాఖాధికారులు జి.వి.ఆర్. దుర్గా ప్రసాద్. చదువుకోడానికి చక్కని బెంజీలు, కుర్చీలు, డెస్క్ లు, విద్యార్థులకు మినరల్ వాటర్ సౌకర్యం, విద్యుత్, మరుగుదొడ్లు, ఇక అధునాతన టెక్నాలజీని అందించే కంప్యూటర్లు, ఇంటర్ నెట్ సౌకర్యాలు...ఒకటేమిటి... అన్నీ కార్పొరేట్ స్కూళ్ళను తలపించే వసతులు ఇక్కడ కల్పించారు. పాఠశాల ప్రవేశ ద్వారాలు రంగులతో అలరిస్తున్నాయి. మరో పక్క తరగతి గదుల్లో అందమైన టేబుల్స్, కుర్చీలు, అల్మరాలు... విద్యార్థులకు తాగునీటికి ఫిల్టర్లు సైతం అమర్చారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు-నేడుతో సర్కారీ స్కూళ్ళ దశ మారిపోయిందని గొల్లప్రోలు ఎంఇఓ గుడివాడ వెంకట రమా దుర్గా ప్రసాద్ వెబ్ దునియాకు వివరించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని సమర్ధంగా అమలు చేస్తున్నామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడి విద్యా వసతులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, డి.ఇ.ఓల సహకారంతో ఇపుడు మండలంలోని పాఠశాలు ఆదర్శవంతంగా రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. దీనితో ఇటీవల విద్యార్థుల తల్లితండ్రులు కూడా తమ పిల్లల్నిప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఇంతటి మార్పునకు శ్రీకారం చుట్టిన నాడు-నేడు పథకానికి ఎంతో ఘనత దక్కుతుందన్నారు.