అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు.. అయినా జైలుకే పరిమితం

ఠాగూర్

సోమవారం, 9 ఫిబ్రవరి 2026 (21:19 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఓ కేసులో బెయిల్ లభించింది. అయినప్పటికీ ఆయనపై మరో కేసు నమోదైంది. దీంతో ఆయన ఈ నెల 22వ తేదీ వరకు జైలులో రిమాండ్ ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇటీవల టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను ఈ నెల ఒకటో తేదీన అరెస్టు చేయగా అప్పటి నుంచి రాజమండ్రి జైలులో ఉంటున్నారు. అయితే, ఈ కేసులో ఆయనకు గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలవుతారని అంతా భావించారు. 
 
కానీ, ఆయన బెయిలుపై విడుదలవుతున్న సమయంలోనే పట్టాభిపురం పోలీసులు మరో కేసులో రంగ ప్రవేశం చేశారు. గతంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై అంబటిని స్పెషల్ జ్యూడిషియల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు.. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఈ నెల 22వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. 
 
సీఎంపై వ్యాఖ్యల కేసులో ఈ నెల ఒకటో తేదీన అరెస్టయిన అంబటి రాంబాబు రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉంటున్న విషయం తెల్సిందే. తాజాగా ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్ విధించడంతో తిరిగి ఆయనను అదే జైలుకు తరలించారు. మరోవైపు, అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదైవున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు