జనసేన పార్టీ నుంచి వైదొలిగేందుకు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చూపిన కారణంగా సహేతకంగా లేదని సినీ నిర్మాత, తెదేపా నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికాకృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.
దీనిపై అంబికాకృష్ణ స్పందిస్తూ, జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడానికి వి.వి.లక్ష్మీనారాయణ ఎత్తిచూపిన కారణం సహేతుకంగా లేదన్నారు. వృత్తిని కొనసాగిస్తే అందులో తప్పుపట్టడానికి ఏముంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వెనకేసుకు వచ్చారు.
వృత్తిని వదిలేసి రాజకీయాలు చేయాలని ఎవరూ చెప్పలేదన్నారు. లక్ష్మీనారాయణ బయటకు వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవడం తప్పుకాదని, కానీ వెళ్లిపోతూ చేసిన ఆరోపణ సరికాదని హితవు పలికారు. పవన్ కల్యాణ్ సినిమాలలో నటిస్తూ రాజకీయాల్లో కొనసాగాలని కోరుతున్నానన్నారు.
అలాగే, ఐవైఆర్ కృష్ణారావు కూడా స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్న ఈ తరుణంలో జనసేన నుంచి వీరి రాజీనామా సరైన నిర్ణయం కాదేమోనని నా అభిప్రాయం. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తృతీయ కూటమి బలపడటానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.