Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

చిత్రాసేన్

బుధవారం, 15 అక్టోబరు 2025 (14:31 IST)
Priyadarshi
అనుదీప్, విజయ్, ఆదిత్య హాసన్, కళ్యాణ్ శంకర్ ఇలా అందరూ రూమ్ మేట్స్. ఎవరి ప్రభావం ఎవరి మీద పడింది అన్నది చెప్పడం కష్టం. వీళ్లకున్న పిచ్చే వాళ్లను కలిపినట్టుంది. విజయేందర్ చెప్పిన కథ వింటే.. అనుదీప్ కథను కాపీ కొట్టాడా? అని అనిపించింది. కానీ ప్రతీ ఒక్క విషయాన్ని ఎంతో వివరంగా చెప్పాడు. అప్పుడు నాకు విజయేందర్ సొంత కథే అని అర్థమైంది. బన్నీ వాస్ మిత్రమండలి, విజయేందర్ మిత్రమండలి, ఆర్టిస్టుల మిత్రమండలి, టెక్నీషియన్స్ మిత్రమండలి ఇలా అందరం కలిసి ఈ మూవీని చేశాం అని ప్రియదర్శి అన్నారు.
 
కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ప్రియదర్శి పలు విషయాలు చెప్పారు.
 
జాతి రత్నాలు ఇచ్చిన కాన్ఫిడెంట్‌తోనే ఈ మూవీని ఓకే చేశారా?
అనుదీప్ ఆ టైంలో ‘జాతి రత్నాలు’ కథ చెప్పినప్పుడు ఆయన రైటింగ్ నాకు చాలా నచ్చింది. సమాజంలోని కొన్ని సమస్యల్ని సెటైరికల్‌గా చెబుతుంటారు. ఇందులో కుల వ్యవస్థ మీద విజయేందర్ మంచి సెటైరికల్‌ సీన్లు రాసుకున్నారు. సినిమాల్లో ఇచ్చే సందేశాల ద్వారా సమాజం మారుతుందని నేను నమ్మను.
 
సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కామెంట్లు, క్రింజ్ అనే కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటి?
అవతలి వాళ్లని నవ్వించే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ అవతలి వాళ్లని తక్కువ చేసి కామెడీ చేయడమే నా దృష్టిలో క్రింజ్ అవుతుంది. కొన్ని సార్లు వాదనలు గెలవలేనప్పుడు, మనల్ని ఏమీ చేయలేకపోతోన్నప్పుడు అలాంటి నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు. కొన్ని కొందరికి వర్కౌట్ అవుతుంది.. ఇంకొన్ని కొందరికి వర్కౌట్ కావు.
 
ఏది చేసినా జాతి రత్నాలు తో పోల్చేస్తున్నారు? మళ్లీ ఇలాంటి జానర్‌లోనే ఎందుకు చేస్తున్నారు?
జాతి రత్నాలు, మిత్ర మండల..’ ఒకేలా ఉండవు. ‘జాతి రత్నాలు’ తరువాత ‘35 చిన్న కథ కాదు’, ‘కోర్ట్’ వంటి డిఫరెంట్ చిత్రాలు చేశాను. ఎప్పుడూ ఒకే రకమైన జానర్ చిత్రాల్ని చేయడం నాకు కూడా ఇష్టం ఉండవు. ‘జాతి రత్నాలు’ టైపులో ఎవరైనా కథ చెబితే కూడా వద్దని అంటాను.
 
మీ ‘మిత్ర మండలి’ మీద కావాలనే నెగెటివ్ క్యాంపైన్ జరుగుతోందా?
విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే బాగుంటుంది. కానీ కావాలనే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. కించ పర్చాలని, కిందకు తొక్కాలని టార్గెటెడ్‌గా హేట్‌ను వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి ద్వేషాన్ని వ్యాప్తి చేసే వాళ్ల కోసం మేం నలుగురు కలిసి ఆ ఫన్నీ వీడియోని చేశాం. అలా టార్గెటెడ్ హేట్రెడ్‌ని స్ప్రెడ్ చేసే వాళ్లు కనీసం సొంత పేరు కూడా పెట్టుకోరు. ఏవేవో పేర్లతో, ఫేక్ ఐడీలతో ఇలాంటి పనుల్ని చేసే వారిని మనం ఏం చేయగలం.
 
‘మిత్ర మండలి’పై ఓవర్సీస్‌లో ఎలాంటి బజ్ ఉంది?
‘మిత్ర మండలి’పై ఓవర్సీస్‌లో మంచి బజ్ ఉంది. అక్కడి వాళ్లు మనకంటే ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాని చూస్తుంటారు. మన భాష, మన వాళ్ల మీద ఉన్న అభిమానంతో తెలుగు సినిమాల్ని చూస్తుంటారు. అలాంటి వారందరినీ మా ‘మిత్ర మండలి’ నవ్విస్తుంది.
 
‘మిత్ర మండలి’ ప్రాజెక్ట్‌లోని నిహారిక ఎన్ ఎం ఎలా వచ్చారు?
నిహారిక ఎన్ ఎం తెలుగమ్మాయి కావడం మాకు చాలా సులభతరమైంది. ఆమె మాతో ఎంతో కంఫర్టబుల్‌గా కలిసిపోయారు. మాకు ఆమె పెద్ద ఎస్సెట్‌గా మారారు.
 
‘మిత్ర మండలి’ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా అనిపించింది?
‘మిత్ర మండలి’ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గానే అనిపించింది. అందుకే నేను ‘మిత్ర మండలి’కి ఓకే చెప్పాను. నేను విన్నప్పుడు ఏం అనుకున్నానో.. తెరపైకి కూడా అదే వచ్చింది. అందుకే నేను అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.
 
‘‘మిత్ర మండలి’ ఆడియెన్స్‌కి నచ్చకపోతే.. నా నెక్ట్స్ సినిమాని చూడకండి’ అని అంత పెద్ద స్టేట్‌మెంట్ ఎందుకు ఇచ్చారు?
‘మిత్ర మండలి’ మీద నాకున్న నమ్మకంతోనే అలా అన్నాను. నాని అన్నకి ‘కోర్ట్’ మీద ఉన్న నమ్మకంతో ఈవెంట్‌లో అలా చెప్పారు. నాక్కూడా నా ‘మిత్ర మండలి’ మీద అంతే ప్రేమ, నమ్మకం ఉంది. అందుకే అలా అన్నాను. అంతే కానీ మిగతా చిత్రాల్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు.
 
మీ చేతిలో ప్రస్తుతం ఎన్ని ప్రాజెక్ట్‌లు, ఎన్ని డిఫరెంట్ కథలు ఉన్నాయి?
ప్రస్తుతం నా దగ్గరకు చాలా డిఫరెంట్ కథలు వచ్చాయి. అందులో ‘ప్రేమంటే’ అనే మూవీ షూటింగ్ జరుగుతోంది. మరో రెండు కథలు నాకెంతో నచ్చాయి. వాటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే జరుగుతుంది.
 
‘మిత్ర మండలి’లో కథ ఎలా ఉంటుంది?
‘మిత్ర మండలి’లో ఎవ్వరినీ ఉద్దేశించి కథను రాసుకోలేదు. ఓ ఫిక్షనల్ క్యాస్ట్ నేమ్ పెట్టి చాలా సెటైరికల్‌గా తీశాం. ఏ ఒక్క కులం మీదనో సెటైర్ వేస్తున్నట్టుగా అనిపించదు. ఇది మమ్మల్నే అన్నట్టు ఉందే? అని అనిపిస్తే మాత్రం మేం ఏమీ చేయలేం (నవ్వుతూ). ఎవ్వరి మనోభావాల్ని దెబ్బ తీసేలా మాత్రం మా చిత్రం ఉండదు. అందరినీ నవ్వించేలా, ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది.
 
ప్రీమియర్స్‌తో మీరేమైనా ఒత్తిడిగా ఫీలవుతున్నారా?
మిత్ర మండలి తో పాటుగా మరో మూడు సినిమాలు వస్తున్నాయి. ఇక ప్రీమియర్ వేస్తుండటంతో మేం ముందుగా వస్తున్నట్టు అయింది. మా మూవీ రిజల్ట్ కూడా  ముందే వస్తుంది. అయినా ఈ నిర్ణయం బన్నీ వాస్ అండ్ టీం తీసుకున్నదే. ప్రీమియర్లు మాకు ప్లస్ అవుతాయనే అనుకుంటున్నాను. మేం ఎంత చెప్పినా కూడా చివర్లో ఆడియెన్స్ ఇచ్చే ఫలితమే ఫైనల్ అవుతుంది. అంత వరకు మాత్రం మాకు మీడియా సపోర్ట్ చేయాలి. కృతజ్ఞతలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు