ప్రణయ్ హత్య కేసు.. అమృత తండ్రికి షరతులతో కూడిన బెయిల్

శనివారం, 27 ఏప్రియల్ 2019 (10:52 IST)
తెలుగు రాష్ట్రాల్లో గతేడాది మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ఎంతటి కలకలం సృష్టించిందో తెలిసిందే. జనవరి 30న వారి ఫస్ట్ మ్యారేజ్ డే నాడు అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో ప్రణయ్ హత్య కేసులో కీలక నిందితుడైన అమృత తండ్రికి తాజాగా బెయిల్ లభించింది. ఈ మేరకు ప్రణయ్ హత్య కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏడు నెలల తరువాత నిందితులకు బెయిల్ వచ్చింది.
 
కాగా గత ఏడాది సెప్టెంబర్ 14న అమృతతో కలిసి ఆసుపత్రి నుంచి తిరిగి వస్తోన్న ప్రణయ్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో ప్రణయ్ అక్కడికక్కడే మరణించాడు. కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో అమృత తండ్రి మారుతీరావే.. ప్రణయ్‌ను హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అమృత తండ్రి మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, మరో వ్యక్తి కరీంను నిందితులుగా చేరుస్తూ పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.
 
అప్పటి నుంచి వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంటోన్న ఈ ముగ్గురు నిందితులు రెండు నెలల క్రితం బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందంటూ పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు వీరి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ విషయమై తాజాగా హైకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు