అనంతపురం జిల్లాలో తొలివిడత జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆదివారం నామినేషన్ల ఘట్టం పూర్తయింది. వైసీపీ, టీడీపీ మద్దతు దారులు నామినేషన్‌లు వేయడంలో పోటీపడ్డారు. దీంతో అత్యధికంగా సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని ప్రయత్నించిన అధికార పార్టీ నేతల వ్యూహం బెడిసికొట్టినట్లయ్యింది.
ప్రధానంగా తక్కువ ఓటర్లున్న పంచాయతీలను ఏకగ్రీవం చేసే దిశగా అధికార పార్టీ నేతలు ఎత్తులు వేశారు. ఏకగ్రీవాలైతే ప్ర భుత్వం పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించిందన్న అధికార పార్టీ నేతల ప్రచారానికి ఎక్కడా స్పందన కనిపించలేదు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ పుట్టపర్తిలో తిష్టవేసి మరీ... ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినా క్షేత్రస్థాయిలో ఫలించలేదు.
అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ముఖ్య నేతలు పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు గ్రామస్థాయిలో ఇరు పార్టీలు సంస్థాగతంగా బలంగా ఉండటం కూడా మరో కారణం.