మరో మూడు నెలల్లో పంచాయతీ సమరం : హైకోర్టుకు నివేదిక

గురువారం, 31 అక్టోబరు 2019 (15:39 IST)
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఈ వివరాలను లిఖితపూర్వకంగా అఫిడవిట్‌ రూపంలో తమ ముందుంచాలని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను నవంబరు 18వ తేదీకి వాయిదా వేసింది. 
 
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించట్లేదంటూ కృష్ణా జిల్లాకు చెందిన వేణుగోపాల కృష్ణమూర్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. 
 
దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. దీంతో ఈ వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు