తాము అనుకున్నట్లుగా, ఎలాంటి ఆలస్యం లేకుండా మూడు రాజధానుల నిర్ణయం అమలయ్యేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే... బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ, దీనికి శాసన మండలిలో చుక్కెదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు భావిస్తోంది. ఎందుకంటే మండలిలో విపక్ష పార్టీలకే పూర్తి బలం ఉంది.
ఇక్కడ బిల్లు వీగిపోతే అపుడు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వస్తుంది. చట్టసభల్లో బిల్లును ఆమోదించుకోలేక, ఆర్డినెన్స్ తేవాల్సి రావడం సర్కారుకు అప్రతిష్టగా భావిస్తారు. మండలిలో ఈ బిల్లు భవిష్యత్తు ఏమవుతుందన్న దానిపై సర్కారుకు సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానులపై ఒక తీర్మానాన్ని ఆమోదించేశారు. మండలిలో బిల్లు అటూఇటు అయినప్పటికీ... అసెంబ్లీ తీర్మానం ఆధారంగా రాజధాని తరలింపును ప్రారంభిస్తారని తెలుస్తోంది.