జగన్ 'దొంగదెబ్బ'పై హైకోర్టును ఆశ్రయించనున్న నిమ్మగడ్డ

శనివారం, 11 ఏప్రియల్ 2020 (13:43 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను అర్థాంతరంగా తొలగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఇదే అంశంపై ఆయన న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిప ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు కావడంతో సోమవారం హౌస్‌మోషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
తన పదవీ కాలం మరో యేడాది ఉండగానే ప్రత్యేక ఆర్డినెన్స్‌తో చట్టంలో మార్పుచేసి మరీ తనను పదవి నుంచి తొలగించిన ఏపీ సర్కార్‌ తీరుపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇదే అంశంపై ఆయన న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నియమితులైన తనను దొంగదెబ్బతో తీసేయడం అన్యాయమని ఆయన అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, సీఈసీ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ జగన్‌ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ హరిచందన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని ఆధారం చేసుకుని పదవీకాలం ముగిసిందన్న సాకుతో ప్రభుత్వం ఆగమేఘాల మీద నిమ్మగడ్డను తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో మద్రాసు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి కనగరాజును నియమించడం, ఆయన బాధ్యతలు స్వీకరించడం ఆగమేఘాలపై జరిగిపోయాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు