ఏపీలో మరో పథకం గ్రామ ఉజాలా.. ప్రతి ఇంటికి 4 ఎల్ఈడీ బల్బులు

సోమవారం, 18 జనవరి 2021 (09:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రజాకర్షణ పథకం అమలు కానుది. గ్రామ ఉజాలా పేరుతో ప్రారంభమయ్యే ఈ పథకం కింద ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులను ఒక్కో బల్బు రూ.10 చొప్పున అందజేయనున్నారు. అవి అత్యధిక సామర్థ్యంతో పాటు అధిక వెలుగునిచ్చే బల్బులుగా ఉంటాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఏ.చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడించారు. 
 
ఈ మేరకు కేంద్ర ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) ‘గ్రామ ఉజాలా’ పథకాన్ని అందుబాటులోకి తెస్తోందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి చేపట్టే ఈ పథకాన్ని దేశంలో ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ పథకానికి ఈఈఎస్‌ఎల్‌ రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. 
 
ఈ పథకాన్ని తొలుత ప్రయోగాత్మకంగా మన రాష్ట్రంతో పాటు.. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలను ఎంపిక చేశారు. ఇంధన పొదుపులో భాగంగా గతంలో 9 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బులు అందించారు. ఇప్పుడు 12 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బులు అందిస్తారు. సాధారణ బల్బుతో పోలిస్తే 12 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బుల వల్ల 75 శాతం కరెంట్‌ ఆదా అవుతుంది. 25 శాతం మన్నిక ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించే సామర్థ్యం ఈ బల్బుకు ఉండటం ప్రత్యేకత. 
 
ఏపీలో తొలి దశలో కృష్ణా జిల్లాలోని గుణదల, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, విజయవాడ టౌన్, రూరల్‌లో ప్రతి ఇంటికి 12 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బులు నాలుగు ఇస్తారు. వీటిని తీసుకునే ముందు సాధారణ బల్బులను (40, 60, 100 వాల్టుల బల్బులు ఏదైనా) విద్యుత్‌ అధికారులకు అందజేయాలి. ఈ జిల్లాలో 8.83 లక్షల ఇళ్లకు ఇంటికి నాలుగు బల్బుల చొప్పున పంపిణీ చేయనున్నారు. 
 
గృహ విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బల్బులు తీసుకోవచ్చు. ఈఈఎస్‌ఎల్‌ నేతృత్వంలో స్థానిక విద్యుత్‌ అధికారుల సమన్వయంతో పంపిణీ జరుగుతుంది. ఇందుకోసం విద్యుత్‌ కనెక్షన్ల ఆధారంగా డేటా రూపొందిస్తున్నాం. ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు