మాకు మేమే లాక్డౌన్ విధించుకుంటాం.. ఏపీలో వర్తక సంఘాల నిర్ణయం

శనివారం, 17 ఏప్రియల్ 2021 (18:12 IST)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. దీంతో వ్యాపారస్తులు కూడా దుకాణాల నిర్వహణపై ఆంక్షలు విధించుకుంటున్నారు. ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల వర్తక సంఘాలు స్వీయ లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. 
 
ఇప్పటికే గుంటూరు, విజయవాడలోని వర్తక సంఘాలు నిర్ణీత సమయంలోనే షాపులు తెరుస్తామని ప్రకటించారు. అలాగే కరోనా నిబంధనలు పాటిస్తేనే వినియోగదారులను షాపుల్లోకి అనుమతిస్తామని.. షాపుల్లోనూ మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయాలని వర్తక సంఘాలు సూచిస్తున్నాయి.
 
అలాగే కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఎలాంటి బాధ్యత వహించమని స్పష్టం చేశారు. సోమవారం నుంచి నిర్ణీత సమయంలోనే షాపులు పనిచేయనున్నాయి. గుంటూరు జిల్లాలో ఇటీవల దాదాపు నాలుగువేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 
 
జిల్లాలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సోమవారం నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి ఉంచే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఏయే వేళల్లో వ్యాపారం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నట్లు ది ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు