బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు సవాల్ విసిరిన ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా, ఏంటది?

బుధవారం, 8 జూన్ 2022 (19:00 IST)
రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా మండిపడ్డారు. మోదీ ఆయుష్మాన్ భారత్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పేరుతో అమలు చేస్తున్నారంటూ నడ్డా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

 
బుధవారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ‘బీజేపీ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చిన ఘనత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనూ లేవు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ఎక్కడ? ఏపీలో ఇచ్చిన 32 లక్షల ఇళ్ల స్థలాలను భాజపా పాలిత రాష్ట్రాలు అన్నీ కలిపి ఇవ్వగలవా?’’ అని ఆమె ప్రశ్నించారు.

 
ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని నడ్డా చేసిన విమర్శలపై కేంద్రం, బీజేపీ ముఖ్యమంత్రులు అప్పులు చేయడం లేదా అంటూ రోజా కౌంటర్ ఇచ్చారు. ఆంద్రప్రదేశ్‌కు అన్యాయం చేసేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపింది బీజేపీ అని, ఈ నెలాఖరులో జరిగే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ తన సత్తా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు రోజా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు