కొత్త బియ్యం కార్డుల ముద్రణ పూర్తి

సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (12:06 IST)
ప్రభుత్వం కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. 
 
గతంలో ఉన్న 1.47 కోట్ల రేషన్‌ కార్డులను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కార్డులివ్వనుంది. జాతీయ ఆహార భద్రత చట్టం-2013 పేరిట బియ్యం కార్డులను ముద్రించారు. కొత్త కార్డులో కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటోకు బదులు కార్డు ఎవరి పేరున మంజూరైందో వారి ఫొటోనే ఉంటుంది.
 
కార్డులో నమోదైన కుటుంబ సభ్యుల పేరిట వేర్వేరుగా ఐడీ నంబర్లు ఇచ్చారు. కార్డు ఏ రేషన్‌ డీలర్‌ పరిధిలోకి వస్తుందనే వివరాలు కూడా కార్డులో పొందుపరిచారు. ఇప్పటివరకు ఉన్న రేషన్‌ కార్డులో సభ్యుల వయస్సు మాత్రమే ఉండేది. కొత్త కార్డుల్లో పుట్టిన తేదీతో సహా ముద్రించారు. 
 
కార్డుల్లో పేర్లు, ఇతర సమాచారం తప్పుల్లేకుండా ఉండేందుకు గ్రామ, వార్డు వలంటీర్‌ ద్వారా మరోమారు క్షేత్ర స్థాయిలో విచారించి వివరాలు సరైనవేనని లబ్ధిదారులు ఆమోదించాకే కార్డులను తయారు చేశారు. కార్డులో తెలుగుతో పాటు ఇంగ్లిష్‌లోనూ వివరాలున్నాయి. సరుకులు అందకుంటే ఫిర్యాదు చేయాల్సిన టోల్‌ ఫ్రీ 1902/1967/18004250082 నంబర్లను కూడా కొత్త కార్డులో ముద్రించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు