నారా లోకేష్‌ను టార్గెట్ చేసిన సోషల్ మీడియా.. అందుకే రవికిరణ్ అరెస్ట్..?

శనివారం, 22 ఏప్రియల్ 2017 (09:09 IST)
ఓ సెటైర్ ప్రోగ్రామ్ ద్వారా తెలంగాణ నాయకులను కించపరిచారనే కారణంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అండ్ టీమ్ గతంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్లను అనధికారికంగా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. దీనిపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఇంటూరి రవికిరణ్ అరెస్ట్ ద్వారా అడ్డగోలు ప్రచారం చేస్తే ఊరుకోబోమనే సంకేతాలు పంపించాలని టీడీపీ సర్కారు భావిస్తోంది. 
 
అయితే సోషల్ మీడియాలో దుష్ప్రచారం అనేది కొత్త విషయమేమీ కాదు. కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు ఎన్నో జరుగుతున్నాయి.  పార్టీలు, పార్టీలపై, వ్యక్తులపై వ్యంగ్య కామెంట్లు, కార్టూన్లు ఇలాంటివి ఎన్నో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అలాంటి పోస్టులు చేసిన వారిపై చంద్రబాబు సర్కారు కొరడా ఝుళిపిస్తుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.   
 
సోషల్ మీడియా ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నా.. ఇప్పుడే చర్యలు తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటనేది విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. కానీ ఇందుకు కారణం మాత్రం నారా లోకేషేనని టాక్. ఈ మధ్య సోషల్ మీడియా మంత్రి అయిన నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తున్నాయి. 
 
ఇటీవల లోకేశ్ మంత్రి కావడం.. ఆయన ప్రమాణస్వీకారం, అంబేద్కర్ వర్థంతిని జయంతి అనడం.. వంటి ఘటనలపై సోషల్ మీడియాలో విపరీతమైన జోకులు పేలాయి. ఈ వ్యవహారంతోనే అధికార పార్టీ కోపం పతాకస్థాయికి చేరి చివరకు రవికిరణ్ అరెస్టుకు దారి తీసి ఉంటుందన్నది ఓ విశ్లేషణ.
 
పొలిటికల్ పంచ్ పేజ్' వ్యవహారం కాస్తా వైఎస్ జగన్ మెడకు చుట్టుకుంది. ఈ పేజ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో వెల్లడైన విషయాలు పోలీసులనే బిత్తరపోయేలా చేశాయి. ఈ మొత్తం కథ వెనక ఉన్నది వైఎస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికే కారణమని పోలీసులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి