అక్ష్యరాస్యతలో అట్టడుగు స్థానం - 100 శాతం దిశగా అడుగులు : సీఎం జగన్

మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (13:19 IST)
దేశంలో అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచింది. 'హౌస్‌హోల్డ్‌ సోషల్‌ కన్సంప్షన్‌ : ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా' అనే అంశంపై నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ 'జాతీయ నమూనా సర్వే' పేరిట నిర్వహించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేళ్ల వయసు దాటిన వారిలో అక్షరాస్యత రేటుపై ఆ సర్వే ఆధారంగా ఒక నివేదికను సమర్పించింది. ఇందులో కేరళ అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఆఖరి స్థానంలో నిలిచింది. 
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల జీవితాలను మార్చగల శక్తి విద్యకు మాత్రమే ఉందని అన్నారు. పేదరికం, అసమానత్వాలపై పోరాటానికి విద్య ఒక ఆయుధమని చెప్పారు. అమ్మఒడి, నాడు-నేడు, విద్యాదీవెన పథకాల ద్వారా రాష్ట్రంలో విద్యావ్యవస్థ రూపురేఖలను మారుస్తున్నామని తెలిపారు. ఈ పథకాల ద్వారా 100 శాతం అక్షరాస్యతను సాధించేందుకు ఒక మార్గాన్ని తయారుచేసుకున్నామని చెప్పారు.
 
కాగా, జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో అక్ష్యరాస్యతపై ఓ సర్వే నిర్వహించగా, ఇందులో ఎప్పటిలాగే అక్ష్యరాస్యతలో కేరళ రాష్ట్ర అదరగొట్టింది. ఈ రాష్ట్రం 96.2 శాతం అక్షరాస్యతతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 88.7 శాతం అక్షరాస్యతో ఢిల్లీ రెండోస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరాఖండ్‌ (87.6శాతం), హిమాచల్‌ప్రదేశ్‌(86.6శాతం), అసోం (85.9శాతం) ఉన్నాయి.
 
ఇకపోతే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మాత్రం తమతమ స్థానాలను మెరుగుపరుచుకోకపోగా, మరింతగా దిగజారిపోయాయి. ఈ జాతీయ నమూనా సర్వే ప్రకారం 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగు స్థానంలో నిలవగా.. తెలంగాణ కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. 
 
'హౌస్‌హోల్డ్‌ సోషల్‌ కన్సంప్షన్‌ : ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా' అనే అంశంపై నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ 'జాతీయ నమూనా సర్వే' పేరిట నిర్వహించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేళ్ల వయసు దాటిన వారిలో అక్షరాస్యత రేటుపై ఆ సర్వే ఆధారంగా ఒక నివేదికను సమర్పించింది. దాని ప్రకారం.. దేశంలో అక్షరాస్యత రేటు 77.7 శాతంగాను, గ్రామీణ ప్రాంతాల్లో 73.5 శాతంగా ఉండగా.. పట్టణప్రాంతాల్లో 87.7 శాతంగా నమోదైంది. 
 
స్త్రీ, పురుషుల్లో అక్షరాస్యత విషయానికి వస్తే.. పురుషుల్లో అది 84.7 శాతంగా ఉండగా, మహిళల్లో 70.3 శాతం. ఇది జాతీయ సగటు. రాష్ట్రాలవారీగా చూసుకున్నా.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కేరళలో అత్యధికంగా పురుషుల అక్షరాస్యత రేటు 97.4 శాతం ఉండగా.. స్త్రీలలో 95.2 శాతం ఉంది. ఏపీలో పురుషుల అక్షరాస్యత రేటు 73.4 శాతం ఉండగా.. మహిళల్లో 59.5 శాతంగావుంది. 
 
కాగా, ఈ సర్వేను 2017 జూలై నుంచి 2018 జూన్‌ నడుమ దేశవ్యాప్తంగా 8097 గ్రామాల్లో 64,519 మందిని.. పట్టణప్రాంతాల్లో 49,238 మందిని ప్రశ్నించి ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న గ్రామీణప్రాంతాలవారిలో 4 శాతం మంది ఇళ్లల్లో, పట్టణప్రాంతాల వారిలో 23 శాతం మంది ఇళ్లల్లో కంప్యూటర్లు ఉన్నట్టు తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు