తిరుమలనే సవాల్ చేస్తున్న కరోనావైరస్... కొండపై ఎటు చూసినా నిశ్శబ్దమే...(video)

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (08:29 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తిరుమల చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కంటికి కనిపించని వైరస్ ... దేవదేవుడు కొలువైవుండే తిరుమల కొండనే సవాల్ చేస్తోంది. ఫలితంగా నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ కనిపించే తిరుమల గిరులు ఇపుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. 
 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా శ్రీవారి దర్శనాన్ని తితిదే అధికారులు మూసివేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. కరోనా అన్‌లాక్  ప్రకటించినప్పటికీ... భక్తులు మాత్రం శ్రీవారి దర్శనం కోసం వచ్చేందుకు ఏమాత్రం సాహసం చేయడం లేదు. ఫలితంగా శ్రీవారి పరిసర ప్రాంతాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. 
 
నిజానికి కరోనా మహమ్మారికి ముందు... తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని రోజుకు సగటున 80 వేల మంది దర్శించుకునేవారు. రద్దీరోజులు, శేషపర్వదినాల్లో ఈ సంఖ్య లక్ష వరకు చేరుకునేది. ప్రస్తుతం 10 వేల నుంచి 11వేల మంది మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తమకు కేటాయించిన సమయాల్లోనే క్యూలైన్‌లోకి ప్రవేశిస్తుండటంతో ఎక్కడా రద్దీ కనిపించడం లేదు. అఖిలాండం వద్ద కూడా భక్తుల రద్దీ తక్కువగా కనిపిస్తోంది. పుష్కరిణిలో స్నానాలు రద్దు చేయడంతో అక్కడా భక్తులు కాలు కూడా పెట్టడం లేదు. 
 
భక్తులు లేకపోవడంతో తిరుమలలో అందుబాటులో వున్న దాదాపు 7,400లకు పైగా గదులు ఖాళీగా ఉన్నాయి. కరోనాకు ముందు ఈ గదుల కోసం భక్తులు గంటలు తరబడి నిరీక్షించేవారు. గదులు లభించక కొంతమంది యాత్రీకుల వసతి సముదాయాలు, కార్యాలయాల ముందు, ఫుట్‌పాత్‌, షెడ్లలో ఇక అన్నదాన సత్రం వైపు భక్తులు కన్నెత్తి కూడా చూడటం లేదు. 
 
నిజానికి శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ఒక్క పూట అయినా అన్నదాన సత్రంలో భోజనం చేయడం ఆనవాయితీగా భావించేవారు. ఇపుడు అటు పెద్దగా వెళ్ళడమే లేదు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనంలో గతంలో రోజుకు 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించేవారు. ఇప్పుడా సంఖ్య సిబ్బందితో కలిపి 10 వేలు దాటడం లేదు.
 
ఇక శ్రీవారి ప్రసాదాల విక్రయాల సంఖ్య ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన ప్రతిఒక్కరు లడ్డూప్రసాదాన్ని తీసుకెళ్లడం ఆనవాయితీ. గతంలో రోజుకు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు లడ్డూలను భక్తులు పొందేవారు. ప్రస్తుతం రోజుకు 50 వేల లడ్డూలు మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో 5 వేల వరకు ఉండే పెద్దలడ్డూలు(కల్యాణోత్సవం లడ్డూ) విక్రయాలు 3 వేలకు, 4 వేలుగా ఉండే వడల విక్రయాలు 3వేలకు పడిపోయాయి.
 
ఇదిలావుండగా, తిరుమలలో కొన్ని వారాల కిందట దర్శనాలు పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో, తిరుమల వెంకన్న సన్నిధి పునఃప్రారంభం తర్వాత నేడు రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. ఆదివారం హుండీ ద్వారా రూ.1 కోటి 2 లక్షలు ఆదాయం వచ్చినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, పునఃప్రారంభం తర్వాత అత్యధికంగా నిన్న స్వామివారిని 13,486 మంది దర్శించుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెంకటేశ్వరుడి దర్శనాలను పరిమితం చేశారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు