ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో స్వల్ప మార్పులు చేయనున్నారు. ఇదే అంశంపై రాష్ట్ర విద్యాశాఖ కసరత్తులు చేపట్టింది. ఈ పథకం అమలులోభాగంగా ప్రతి గురువారం నాడు మధ్యాహ్న భోజనానికి బదులుగా ఇడ్లీ సాంబార్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండలంలోని చిర్రాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాళలో నూతన మోనూ ప్రకారం ఇడ్లీ సాంబారును వచ్చే వారం నుంచి వడ్డించనున్నారు.
తాడేపల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ప్రతి గురువార మధ్యాహ్నం ఒక్కొక్కరికి నాలుగు ఇడ్లీలు, ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఐదు ఇడ్లీలు చొప్పున వడ్డీస్తామని మధ్యాహ్నం భోజన పథకం అమలు జిల్లా అసిస్టెంట్ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో పాత మెనూ ప్రకారం ప్రతి గురువారం కిచిడీ, టమోటా చట్నీ, ఉడికించిన గుడ్డును విద్యార్థులకు అందచేస్తూ వచ్చారు.