నరసారావుపేటలో కరోనా లాక్‌‌డౌన్.. ప్రజలంతా గృహ నిర్బంధం

శుక్రవారం, 1 మే 2020 (11:29 IST)
గుంటూరు జిల్లాలోని నరసారావుపేట ప్రజలు కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నారు. ఢిల్లీ మర్కజ్ మత సమ్మేళనానికి వెళ్లివచ్చిన ఓ టీ వ్యాపారి ద్వారా ఈ వైరస్ పట్టణంలో వ్యాపించింది. ఫలితంగా ఏకంగా ఒక్క నరసారావు పేటలో 106 కేసులు నమోదయ్యాయి. దీంతో నెల మూడో తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్ ప్రకటించారు. 
 
గురువారం ఆయన పట్టణంలోని రెడ్‌జోన్‌ ప్రాంతాలతో పాటు వరవకట్ట ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవ్వటంతో నరసరావుపేట పేరు రాష్ట్రంలో మారు మోగిపోతున్నదన్నారు. పట్టణంలో చివరి పాజిటీవ్‌ కేసు నమోదైన తదుపరి 28 రోజులు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని గుర్తుచేశారు. 
 
దీనిని దృష్టిలో ఉంచుకొని కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటించాలన్నా రు. ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు రావద్దని, లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా పాల విక్రయాలతో పాటు నిత్యావసరాలు, మందులు ఇళ్లకే సరఫరా చేసే విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. 
 
మరోవైపు, సంపూర్ణ లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో పట్టణంలో నిత్యావసర సరకులతో పాటు.. కూరగాయలు, పాలు విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా, పాలు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంపూర్ణ లాక్‌డౌన్‌ నుంచి పాల బూత్‌లను మినహాయించినట్టు ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లు, డీఎస్పీ వీరారెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తూ, ప్రజలను మాత్రం ఇళ్ళ నుంచి బయటకు రానివ్వడం లేదు. ఫలితంగా వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు