ఏపీలో 8 మంది వైద్యులకు కరోనా... కర్నూలులో 386

గురువారం, 30 ఏప్రియల్ 2020 (22:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం కూడా కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, కర్నూలులో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఈ జిల్లాలో ఎనిమిది మంది వైద్యులకు ఈ వైరస్ సోకింది. దీనికితోడు గత 24 గంటల్లో ఈ జిల్లాలో ఏకంగా 43 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులతో కలుపుకుని ఒక్క కర్నూలు జిల్లాలోనే మొత్తం 386 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, ఎనిమిది మంది వైద్యులకు ఈ వైరస్ సోకడం ఇపుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. మరోవైపు, ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ర్యాపిడ్ టెస్ట్‌లను నిర్వహిస్తోంది. అందువల్లే కొత్త కేసులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయనే పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో గురువారం 22 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదైన విషయం తెల్సిందే. గురువారం నమోదైన 22 కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 1038కు చేరింది. అలాగే ముగ్గురు చనిపోగా, ఈ మృతుల సంఖ్య 28కి చేరుకుంది. మరోవైపు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 442కు చేరింది. అంతేకాకుండా, కేసుల కట్టడి కోసం కంటోన్మెంట్ జోన్లపై దృష్టిసారించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు