సర్పంచ్ దాతృత్వం.. రూ.4లక్షలు పెట్టి అంబులెన్స్ కొనుగోలు చేశాడు..

బుధవారం, 2 జూన్ 2021 (08:41 IST)
Andhra sarpanch
కరోనా రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. సమయానికి అంబులెన్స్ దొరకక.. అడిగినంత ఇచ్చుకోలేక మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని కృష్ణా జిల్లా అంబాపురం గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య గ్రామస్తుల కోసం సొంత డబ్బుతో అంబులెన్స్ కొనుగోలు చేశారు. కరోనా రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవడంతో నాలుగు లక్షలు పెట్టి అంబులెన్స్ కొనుగోలు చేశాడు సీతయ్య.
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సర్పంచ్ సీతయ్య గ్రామంలో అంబులెన్స్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. 108 ఫోన్ చేసినా సరైన సమయానికి వచ్చేది కాదని.. కొన్ని సార్లు అసలు రాలేదని అన్నారు. కరోనా రోగులను ఆటో, కార్లలో తీసుకెళ్లామని వాటిలో ఆక్సిజన్ లేకపోవడంతో వారు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు.
 
ప్రైవేట్ అంబులెన్స్ లను అడిగితే 100 కిలోమీటర్ల దూరానికి కూడా రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఛార్జ్ చేస్తున్నారని ఇవ్వన్నీ దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులకు తనవంతు సాయం చెయ్యాలని అంబులెన్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. 
 
కాగా ఇప్పటివరకు అంబాపురం గ్రామంలో 100 మంది కరోనా బారినపడినట్లు సీతయ్య తెలియచేశారు. ఈ అంబులెన్స్ తమ గ్రామంతోపాటు పక్క గ్రామాల్లో కూడా సేవలు అందిస్తుందని ఎవరికైనా అవసరం ఉంటే సీతయ్య సేవ సమితి సభ్యులను సంప్రదించాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు